తప్పుడు సమాచారానికి కేరాఫ్ గా మారిన ఏపీ, తెలంగాణ ఎన్నికలు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2024 10:12 AM IST
Andhra Pradesh, telangana, elections ,

తప్పుడు సమాచారానికి కేరాఫ్ గా మారిన ఏపీ, తెలంగాణ ఎన్నికలు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో ఇటీవలే పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ), ఎన్‌.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీ (జెఎస్‌పి)ల మధ్య మంచి పోటీ నెలకొంది. ఈ సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ ఎన్నికల చక్రంలో తప్పుడు కథనాల సంఖ్య బాగా పెరిగాయి. మానిప్యులేటెడ్ విజువల్స్, కల్పిత ప్రకటనలు.. అనిశ్చితి, వివాదానికి కారణమైంది.

ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా తప్పుడు సమాచార వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మే 13 పోలింగ్ తర్వాత.. తెలంగాణలో పోలింగ్ సమయంలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించడమే కాకుండా.. ఈ ఎన్నికలకు సంబంధం లేని చాలా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు జరిగినప్పుడు, టీడీపీ-వైసీపీ మద్దతుదారులు తమ పార్టీలకు అనుకూలంగా నకిలీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను షేర్ చేశారు.

ర్యాలీ ఫోటోలను కూడా డిజిటల్ మానిప్యులేషన్:

AP ముఖ్యమంత్రి జగన్ ర్యాలీలకు ఎక్కువ మంది జనం వచ్చినట్లు చూపించడానికి వైసీపీ ప్రయత్నం చేసిందని కూడా విమర్శలు వచ్చాయి. YSRCP అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో మార్చి 10 ఎన్నికల సమావేశంలో ప్రేక్షకుల సంఖ్యను పెంచుతూ డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటోను పోస్ట్ చేశాయి. ముఖ్యమంత్రి అధికారిక ఖాతాల నుండి ఎడిట్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసినందుకు పార్టీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

ఏప్రిల్‌లో, YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీలో చంద్రబాబు నాయుడు రోడ్‌షో ఫోటోను పోస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఖాళీ రోడ్లపై ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ఆ ఫోటో కొన్ని సంవత్సరాల నాటిది. 2024 ఎన్నికల ప్రచారానికి సంబంధం లేదు.

విద్యకు సంబంధించి తప్పుదారి పట్టించే వాదనలు:

జనవరిలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ X లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళను అధిగమించిందని అన్నారు.

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాసీ నివేదికను ఆయన ఉదహరించారు. అయితే, 2021, 2023 EAC-PM నివేదికల ప్రకారం ఈ విభాగంలో ఉత్తమ పనితీరును కనబరిచింది మేఘాలయ అని.. ఆంధ్రప్రదేశ్ కాదన్నారు. 2021 నివేదికలో కేరళ కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా స్కోర్ చేయగా, 2023లో వెనుకబడిపోయింది.

రిజర్వేషన్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి:

ఈ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై వాడి-వేడి చర్చలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర చర్చ సాగింది. ఏప్రిల్ 23న తెలంగాణలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని చెప్పారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోటాలను ముస్లింలకు కేటాయించడాన్ని తాను అనుమతించబోనని అన్నారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గానికి నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం తన మద్దతును కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్‌లో తన ర్యాలీల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుకు సంబంధించి చాలా దూరంగా ఉన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నట్లు వే2న్యూస్, ఎబిఎన్ లో వార్తా నివేదికలు వచ్చాయని పోస్టులు వైరల్ అయ్యాయి. తాము అలాంటి నివేదికను ప్రచురించలేదని రెండు మీడియా సంస్థలు ఆ తర్వాత స్పష్టం చేశాయి. పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికారిక X ఖాతా ఈ పోస్టులను ఖండించింది.

తప్పుదారి పట్టించే విధంగా ఫేక్ న్యూస్, న్యూస్ ఛానల్స్ కు సంబంధించిన పోస్టులు:

ఎన్నికల సమయంలో రాజకీయ నేతల పేరుతో తప్పుడు వార్తా కథనాలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఎన్నికల సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి వ్యూహాలను అమలు చేశారు. పలుకుబడి ఉన్న మీడియా సంస్థల లోగోలతో తప్పుడు సమాచారం జనంలోకి వెళ్ళింది.

నవంబర్ 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా.. వే2న్యూస్, NTVకి తప్పుగా ఆపాదించిన న్యూస్ కార్డ్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేవాలయాల భూములను ముస్లింలకు వేలం వేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఎప్పుడూ చేయలేదు. ఇందుకు సంబంధించిన కథనాలను వే2న్యూస్ లేదా ఎన్టీవీ ప్రచురించలేదు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు న్యూస్ ఛానల్ కు సంబంధించిన న్యూస్ ప్లేట్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా NTVకి ఆపాదించినట్లుగా అదే ఫేక్ న్యూస్ కార్డ్ వైరల్ అయింది. తెలంగాణలో మే 13న ఎన్నికల ఓటింగ్ కు కొన్ని గంటల ముందు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

వైరల్ ఆడియో/వీడియో క్లిప్‌లు:

ఎన్నికల సమయంలో, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కు సంబంధించిన ఆడియో క్లిప్ అంటూ విస్తృతంగా వైరల్ చేశారు. ఇది బీజేపీ అంతర్గత సమావేశం నుండి లీక్ అయిన రికార్డింగ్ అని వైరల్ చేశారు. అయితే ఇది చాలా భిన్నంగా ఉంది. ఆడియో క్లిప్ ఎడిట్ చేశారు. బీజేపీ ఎంపీ మీడియా ఇంటర్వ్యూ నుండి ఈ ఆడియోను తీసుకున్నారు.

అసలు ఆడియోలో, బండి సంజయ్ మత ఆధారిత రిజర్వేషన్లు తొలగించనున్నారని అన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఈబీసీలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లను కేటాయించాలని భావిస్తున్నామని అన్నారు. సర్క్యులేట్ చేసిన క్లిప్‌లో బండి సంజయ్ మాటలను వక్రీకరించారు. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వ్యూహాలలో ఇది భాగం.

పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి ప్రత్యర్థులను అడ్డుకోడానికి AI ద్వారా రూపొందించిన కంటెంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజీనామాను ప్రకటించడం, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వంటి ప్రముఖ వ్యక్తులను కలిగి ఉన్న నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోలను రూపొందించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియో డీప్‌ఫేక్ అని టీడీపీ క్లారిటీ ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భువనేశ్వరి తనయుడు నారా లోకేశ్‌ ఆరోపణలు చేశారు.

తప్పుడు సమాచార పోరాట కూటమి (MCA)లో భాగంగా న్యూస్‌మీటర్‌.. డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (DAU) ద్వారా ఆడియోను విశ్లేషించింది. DAU ఆడియోను నిపుణులకు ఫార్వర్డ్ చేసింది. వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి రూపొందించలేదని ధృవీకరించారు. నారా భువనేశ్వరి ఫీచర్ చేసిన వీడియో ప్రామాణికతను ధృవీకరించలేకపోయినప్పటికీ, వారు మరొక మూలం నుండి ఆడియో ఆమెకు తప్పుగా ఆపాదించబడిన డిజిటల్ ఫ్యాబ్రికేషన్ ఘటన కావచ్చునని భావిస్తున్నారు.

ప్రభుత్వ నిఘా సంస్థల విషయంలో తప్పుడు ప్రచారం:

ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమలు చేసిందని తెలుగు రాష్ట్రాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సందేశం వైరల్ అయింది.

అన్ని రకాల ఆన్‌లైన్, టెలిఫోనిక్ కమ్యూనికేషన్‌లను భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నదని.. రాజకీయాలు, మతం లేదా ప్రభుత్వానికి సంబంధించిన సందేశాలను ఫార్వార్డ్ చేయకుండా హెచ్చరిస్తున్నట్లు వైరల్ సందేశంలో ఉంది. ఇది పాటించనందుకు వారెంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని అందులో తెలిపారు. అయితే, ఈ మొత్తం పోస్ట్ కల్పితం.. సంవత్సరాలుగా వివిధ సందర్భాలలో సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ తప్పుడు సమాచారాన్ని 2023లోనే ఖండించింది.

భారత ఎన్నికల సంఘం ఓటు వేయని వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో మరో మెసేజీ వైరల్ అయింది. ఈ తప్పుడు సమాచారం దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో కూడా విస్తృతంగా వైరల్ అయింది.ఈ సందేశం మూలం 2019లో నవభారత్ టైమ్స్ ప్రచురించిన వ్యంగ్య కథనమని కనుగొన్నారు.

రాజకీయనాయకుల పేరిట నకిలీ లేఖలు:

టీడీపీ, జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీతో ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తు పార్టీ కార్యకర్తల్లో, ముఖ్యంగా టీడీపీలో అసంతృప్తికి కారణమైంది. కొంతమంది కూటమికి అనుకూలంగా ఉన్నామని చెప్పగా.. మరికొందరు ఈ పొత్తును ఎండగట్టారు.

ఈ ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వరకు మాత్రమే బీజేపీతో పొత్తు.. ఇది తాత్కాలికమేనని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. ఈ లేఖ ప్రామాణికతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే లెటర్ లో ఎన్నో తేడాలు ఉన్న కారణంగా లెటర్ అనుమానాస్పదంగా అనిపించింది. దీనిపై స్పందించిన టీడీపీ ఆ లేఖ ఫేక్ అని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల లెటర్‌హెడ్‌లు, చిహ్నాలతో కూడిన అనేక ఇతర నకిలీ లేఖలు చెలామణి అయ్యాయి.

హోం వ్యవహారాల శాఖా (MHA)కు సంబంధించినట్లుగా కూడా కొన్ని పోస్టులు తప్పుగా ఆపాదించారు. 2021 పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల సమయంలో.. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో నకిలీ సర్వే నివేదికలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వాటిని ట్విట్టర్‌లో ఖండించింది.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు.. YSRCP, NDA కూటమికి సీట్ల సంఖ్యను అంచనా వేస్తూ నకిలీ IB సర్వే ప్రచారం చేశారు. దీనితో పాటుగా, ETV ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన ఒక వీడియోలో కూడా సర్వే ఫలితాలు అంటూ షేర్ చేశారు. అయితే, తేదీ.. ఫార్మాట్‌తో సహా లేఖలోని అనేక వ్యత్యాసాలు కూడా ఇవి అబద్ధాలని ధృవీకరించేలా చేశాయి. తమ సంస్థకు ఆపాదించబడిన నివేదిక నకిలీదని ETV సంస్థ NewsMeterకి ధృవీకరించింది

ఇక ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా ఆయా పార్టీలకు మద్దతుగా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదు.

పోలింగ్ జరిగిన కొద్దిసేపటికే, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కు సంబంధించిన వాదనలతో హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలోని ఒక బూత్‌లో పోల్ రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఆ వీడియో 2022లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది అని పరిశోధనల్లో తేలింది. వీడియో పాతదని, తెలంగాణలో జరగలేదని ధృవీకరిస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వివరణ ఇచ్చారు.

మధ్యతరగతిపై ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఫేక్ న్యూస్

విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు రమేష్ పట్నాయక్ ప్రకారం.. తప్పుడు సమాచారం ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి ప్రజల మీద పడుతోంది. “ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఖచ్చితంగా తప్పుడు సమాచారం వ్యాప్తి ఉంది. ఓటర్లకు, వారి రోజువారీ వాస్తవాలే ఓటింగ్ ఎంపికలను ప్రభావితం చేస్తాయి. సోషల్ మీడియా ప్రచారాలు, తప్పుడు సమాచారం ప్రధానంగా మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేస్తుంది." అని రమేష్ పట్నాయక్ తెలిపారు. జాతీయ నాయకుల ప్రకటనలను స్థానిక రాజకీయ నాయకులకు చేసే విమర్శనాత్మక విశ్లేషణలకు స్థానిక మీడియా పెద్దగా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

సీనియర్ జర్నలిస్ట్, సర్వే ఏజెన్సీ పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్లు సోషల్ మీడియా ప్రచారం కంటే గ్రౌండ్ రియాలిటీ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతారని అన్నారు. తెలంగాణలో, కాంగ్రెస్- బీజేపీ పార్టీలు రెండూ ఒకరినొకరు అప్రతిష్టపాలు చేయడానికి ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని అన్నారు. “బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తోందని.. కాంగ్రెస్ ఆరోపించినప్పుడు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నష్టానికి అవకాశం ఉన్న ముస్లింలకు రిజర్వేషన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని బీజేపీ ప్రచారం చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను అడ్డుకునే లక్ష్యంతో తప్పుడు కథనాలను రూపొందించడం ఒక సాధారణ వ్యూహం" అని తెలిపారు.

'టీడీపీ-జేఎస్పీ' పొత్తు కారణంగా తప్పుడు సమాచారంపై ప్రభావం:

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కూడా తప్పుడు వార్తల ప్రచారంపై ప్రభావం చూపించింది.

"కుల చైతన్యంతో నడిచే ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి సాంప్రదాయకంగా కమ్మలు టీడీపీకి మద్దతివ్వడం, కాపులు జనసేనతో మంచి ప్రాతినిధ్యాన్ని కోరుకున్నారు" అని దిలీప్ రెడ్డి వివరించారు. “ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య సాగిన సోషల్ మీడియా యుద్ధంతో ఈ పొత్తు కూడా కీలకంగా మారింది. టీడీపీ, జేఎస్పీ విడివిడిగా పోటీ చేసి ఉంటే, సోషల్ మీడియాలో మరింత తప్పుడు సమాచారం మనం చూసే అవకాశం ఉండేది." అని అన్నారు.

Next Story