సీబీఐ కస్టడీలో ఉన్న కవితను రేపు కలవనున్న కేటీఆర్!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:45 AM GMTసీబీఐ కస్టడీలో ఉన్న కవితను రేపు కలవనున్న కేటీఆర్!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈడీ విచారణను సవాల్ చేయగా.. పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. జ్యుడిషీయల్ కస్టడీ ముగిసిన తర్వాత సీబీఐ కస్టడీకి కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా మూడ్రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. రేపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. తన సోదరి కవితను కలవనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు ఎమ్మెల్సీ కవితను ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ నెల 15వ తేదీ వరకు సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు. శనివారం నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కవిత విచారణ జరుగుతోంది. ఇక కవితను సీబీఐ కస్టడీలో ఉండగా కలుసుకునేందుకు కేటీఆర్, కవిత భర్త అనిల్, ఆమె పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చిన విసం తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కవితను కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సమయంలోనే కవితను కేటీఆర్ కలవనున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీలో పలు వెసులుబాట్లు కల్పించింది కోర్టు. ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుతించింది.