తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికపై పక్క పక్కనే కూర్చుని, సరదాగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..బెంగళూరులోని చిక్కజాల ప్రాంతంలో శనివారం జరిగిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యారు. సర్జ్ స్టేబుల్ ఈక్వెస్ట్రియన్ ఫెసిలిటీ కేంద్రంలో ఈ పోటీలు నిర్వహించగా, విజేతలకు ట్రోఫీలను స్వయంగా జగన్, కేటీఆర్ అందజేశారు. అంతర్జాతీయ స్థాయి గుర్రపు స్వారీ క్రీడాకారులు ఎడ్వర్డ్ స్కీమిజ్, బొండరివా జైన్, షాడీ సమీర్, వ్యాలంటైన్ మార్కట్ ఈ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.