2024 లో ఏం జరుగుతుంది ?!

How The Political Scenario Will Change In 2024.2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు వచ్చినటువంటి

By -  Nellutla Kavitha |  Published on  10 March 2022 3:41 PM GMT
2024 లో ఏం జరుగుతుంది ?!

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు వచ్చినటువంటి ఐదు రాష్ట్రాల ఫలితాలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. అయితే ఈ రోజు వచ్చినటువంటి మినీ సమరం ఫలితాలు ఎలా భావించాల్సిన అటువంటి అవసరం ఉంది? 2024లో దేశంలో రాజకీయంగా ఎలాంటి మార్పులు, రాజకీయ సమీకరణలు జరగనున్నాయి? దేశవ్యాప్తంగా ఇప్పుడిదే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దుమ్మురేపింది.

ఇక ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీగా ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన ప్రభంజనాన్ని కొనసాగించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయింది. అయితే ఆసక్తికరంగా దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ చేతిలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో ఊడ్చి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రెండే రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తో పాటుగా రాహుల్, లేకపోతే ప్రియాంకాగాంధీ చరిష్మా పనికొస్తుందని ఇంతకాలం భావించారు.

అయితే సోనియా, రాహుల్, ప్రియాంక ప్రభావం యూపీ ఎన్నికల్లో కనిపించలేదు. మరోవైపు పంజాబ్ కూడా తన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక విజయ దుందుభి మోగించిన BJP ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. డెబ్భై ఏళ్ళ ఉత్తరప్రదేశ్ చరిత్ర లో వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం రికార్డ్. అయితే గతంలో కంటే తక్కువ సీట్లను బిజెపి నమోదు చేయగలిగింది. బీజేపీ సాధించిన విజయం కమలనాథుల్లో జోష్ నింపితే, కాంగ్రెస్ని మరింతగా కుంగదీసింది. మరోవైపు ప్రత్యామ్నాయ కూటమి కోసం పావులు కదుపుతున్న బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు షాక్ ఇచ్చాయి ఈ ఫలితాలు. ముఖ్యంగా రైతుఉద్యమం, యూపీలో అత్యాచార ఘటనలు బిజెపికి వ్యతిరేకంగా ఉంటాయని భావించినప్పటికీ, కాషాయ దళం పక్కా వ్యూహంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా చేశారు. sabka saath sabka vikas sabka vishwas అనే నినాదాన్ని ప్రజలు ఆమోదించారని బీజేపీ భావిస్తోంది.

నిన్న ఢిల్లీ కి స్వాతంత్రం వస్తే, ఈరోజు పంజాబ్ కి స్వాతంత్రం వచ్చింది, రేపు దేశమంతా స్వతంత్రం వస్తుంది అని, ఢిల్లీ మోడల్ నేషనల్ మోడల్ అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక దేశభక్తున్ని, టెర్రరిస్ట్ ని కాదని వ్యాఖ్యానించారు. దీంతో 2024 ఎన్నికల మీద మరింత ఆసక్తి పెరిగింది. ఒక ప్రాంతానికే పరిమితమైన AAP రెండు రాష్ట్రాలకు విస్తరిస్తే, జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. మరోవైపు బీజేపీ హవా కొనసాగుతోంది. బిజెపి ముక్త్ భారత్ అంటూ ఏర్పాటు చేయాలనుకున్నా కూటమి సంగతి ఏంటనే చర్చ మొదలైంది. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటవుతాయా అనేదే ప్రధాన ప్రశ్న. లోక్ సభ ఎన్నికల నాటికి మరికొంత సమయం ఉన్నందున ప్రాంతీయ పార్టీలతో రాజకీయ సమీకరణాలు మారతాయా లేదా అనే విశ్లేషణలు మొదలైపోయాయి. దీంతో పాటే రాజకీయ వ్యూహకర్తలు ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ చేసిన నినాదంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల కే పరిమితమైన కాంగ్రెస్, సరికొత్త జవజీవాలను సంతరించుకొని 2024 వరకు పోటీకి సిద్ధం అవుతుందా? బిజెపి ముక్త భారత్ అన్న కెసిఆర్ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తారా? దేశంలో ఎలాంటి రాజకీయ సమీకరణలు రాబోతున్నాయి? ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయా? లేకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోది హావా కొనసాగుతుందా? మినీ సమరం బోల్డన్ని ప్రశ్నల్ని మన ముందుంచింది.

Next Story