తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
By Knakam Karthik
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు.
కాగా సోమవారం అనూహ్య పరిణామాల మధ్య జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రామచందర్‌రావు అధ్యక్ష పదవికి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అలాగే అప్పటి వరకు పోటీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, దర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు నామినేషన్ వేయలేదు. అయితే ఎమ్మెల్యే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యుల బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ స్వీకరించలేదు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామందర్‌రావు ఒక్కడే నామినేషన్లు సమర్పించడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభా కరండ్లాజే ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించారు. దీంతో రామందర్‌రావు.. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ అయిన మాధవ్ ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎవరు పోటీలో నిలవకపోవడంతో మంగళవారం మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. దీంతో ఆయన పురంధేశ్వరి స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.