రాబోయే రెండు, మూడు నెలల్లో సంచలన ప్రకటన

By Nellutla Kavitha  Published on  26 May 2022 1:38 PM GMT
రాబోయే రెండు, మూడు నెలల్లో సంచలన ప్రకటన

ఒక రోజు పర్యటన కోసం బెంగళూరు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ తోపాటుగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు కేసీఆర్. దేశంలో మార్పు కచ్చితంగా ఉంటుందని, రానున్న రెండు మూడు నెలల్లో సంచలనమైన వార్త చెప్తానని అన్నారు సీఎం కేసీఆర్.

దేశ రాజకీయాలతో పాటు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా తాము చర్చించినట్లుగా కెసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరు సంతోషంగా లేరని, దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో కచ్చితంగా మార్పు వచ్చి తీరుతుందని అన్నారు కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, భారత దేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు కెసిఆర్.

జీడీపీలో భారత్ ను చైనా అధిగమించింది అని, చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దేశ ప్రజలు తాగునీరు, విద్యుత్ కోసం, సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని కెసిఆర్ అన్నారు. మనతో పాటే స్వాతంత్రం పొందిన అన్ని దేశాలు అభివృద్ధిలో ముందుకు పోతుంటే మన దగ్గర మాత్రం కంపెనీలు మూతపడుతున్నాయని వ్యాఖ్యానించారు కేసీఆర్.

Next Story
Share it