మరో రాష్ట్ర స్కూల్ సిలబస్ లో భగవద్గీత
By - Nellutla Kavitha |
బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత మరో రాష్ట్రం స్కూల్ సిలబసులో భగవద్గీతను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. భగవద్గీత తో పాటుగా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను స్కూల్ సిలబస్ లో ప్రవేశ పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ పైలట్ ప్రాజెక్టు అమలుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిధ్దమవుతూనే, మరోవైపు స్కూల్ సిలబస్ లో భగవద్గీతను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు డ్రాఫ్ట్ ను సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సరికొత్త ఎడ్యుకేషనల్ పాలసీని అమలుపరిచే తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడబోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిన్న ప్రకటించారు. కొత్త విద్యా విధానంలో భాగంగా హిస్టరీ, జాగ్రఫీ తో పాటుగా లోకల్ ఫోక్ లాంగ్వేజెస్ ను భాగస్వామ్యం చేస్తారు. ఉత్తరాఖండ్ చరిత్ర-సంస్కృతి తో పాటుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాన్ని కూడా సిలబసులో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు భగవద్గీతను, ఉపనిషత్తులను చదవడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి తెలుస్తాయని, వారిలో నైతిక విలువలు కూడా పెంపొందుతాయి భావిస్తోంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇందుకోసం నిపుణులతో పాటు స్థానికుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని డ్రాఫ్ట్ను రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
రాబోయే విద్యాసంవత్సరం నుంచి స్కూల్ సిలబస్ లో భగవద్గీత ప్రవేశపెడుతున్నామని గతంలోనే గుజరాత్ తోపాటుగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించాయి. కర్ణాటక రాష్ట్రం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తామని గతంలోనే ప్రకటించింది. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం భగవద్గీతను స్కూల్ సిలబస్ లో పెడతామని చెప్పినప్పటికీ ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామనేది మాత్రం ప్రకటించలేదు.