ఈనెల 7 నుంచి వరంగల్ లో కాకతీయ వైభవ సప్తాహం

Kakathiya Vaibhava Sapthaham To Be Held At Warangal

By -  Nellutla Kavitha |  Published on  4 July 2022 11:58 AM GMT
ఈనెల 7 నుంచి వరంగల్ లో కాకతీయ వైభవ సప్తాహం

జులై 7 నుండి వరంగల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 7 రోజుల పాటు నిర్వహించనున్న 'కాకతీయ వైభవ సప్తాహం' నిర్వాహణ ఏర్పాట్లపై సన్నహక సమీక్ష సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు KTR, శ్రీనివాస్ గౌడ్ తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలను, మేధావులు, కవులు, సాహితీ వేత్తలను గౌరవించే విధంగా తెలంగాణ సాంస్కృతిక పునర్ వైభవాన్ని చాటేలా కాకతీయ వైభవ సప్తాహం ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచేవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా, రాజకీయాలకు అతీతంగా, అందరూ పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని, దీని కోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించి, విద్యార్థి, యువత కూడా ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి KTR అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ను భాగస్వామ్యం చేసుకోవాలని, మంత్రులు పలు సూచనలను చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా , టూరిజం కార్పొరేషన్ MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story