కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి - కేటీఆర్

Telangana Min KTR Writes Letter To PM Modi And Asks About Jobs

By Nellutla Kavitha  Published on  9 Jun 2022 9:15 PM IST
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి - కేటీఆర్

కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదికి లేఖ రాసారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో మోదీ విఫలం అయిన నేపథ్యంలో, మీ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను దేశ యువత ఆశిస్తోంది అంటూ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.

1. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?

2. మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేపట్టిన చర్యలు ఏమిటి?

3. మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలు ఎన్ని?

4. ఒకవైపుప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టం పైన మన మీ సమాధానం ఏమిటి?

5. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవ‌కాశాలు దక్కవు. ఈ విషయంలో ఆయా వర్గాల యువతకు మీరు ఏం సమాధానం చెబుతారు?

6. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏంటీ?

7. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇక్కడి యువతకి మీరు ఏం చెపుతారు?

8. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 సంవత్సరాలుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్ పై మీ దగ్గర సమాధానం ఉన్నదా?

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని మీరు ఓ వైపు గప్పాలు కొడుతుంటే మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఈ వైఖ‌రి వ‌ల‌న కేవ‌లం దేశంలోనే కాకుండా వీదేశాల్లోని భార‌తీయుల ఉపాధికి ప్ర‌మాదం ఏర్పడుతున్న‌ది. పార్టీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మనదేశం వేగంగా వెళుతోంది. ఫలితంగా కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది.

మీరు గతంలో కూడా తెలంగాణకు వచ్చి తియ్యగ,పుల్లగ మాట్లాడిన్రు. కాని పైసా సాయం చెయ్యలేదు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గ‌డ్డ నుంచి దేశ యువ‌త‌కు ఉపాది-ఉద్యోగ క‌ల్ప‌న‌పై మీ వైఖ‌రి స్ప‌ష్టం చేయండి. దేశ యువ‌త ఉద్యోగాల‌పైన నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వండి. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న 16 లక్షల ఉద్యోగాలభర్తీకి ఏం చర్యలు తీసుకుంటారో వివరించండి. లేకుంటే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువ‌చ్చేలా, ఉద్యోగాల భ‌ర్తీ జరిగేదాకా ఉద్యమిస్తామని కేటీఆర్ ప్రధానికి లేఖ రాసారు.

Next Story