రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా? - జనసేన అధినేత పవన్ కల్యాణ్
JanaSena Chief PawanKalyan Reacts On Vishakha Garjana And Clarifies About JanaVani
By - Nellutla Kavitha | Published on 16 Oct 2022 1:25 PM ISTజనవాణి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర పర్యటనను 3 నెలల క్రితమే నిర్ణయించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. YSRCP నేతలు మూడు రాజధానులపై కార్యక్రమం ప్రకటించడానికి కంటే మూడు రోజుల ముందే తాము విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని పవన్ చెప్పారు. తమ పర్యటనతో వైసీపీ కార్యక్రమాన్ని భగ్నం, నిర్వీర్యం చేయాలనే ఆలోచన లేదన్నారు. మీరు సమస్యలు పరిష్కరిస్తే మా వద్దకు ఎందుకొస్తారని, పోలీసు శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, సీఎం మారితే రాజధాని మారిపోవాలా? అని విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పవన్ ప్రశ్నించారు.
విశాఖ విమానాశ్రయం ఘటన, జనసేన కార్యకర్తల అరెస్టులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యక్రమాలు గురించి వైసీపీ ఎలా చెబుతుందని, అసలు వాళ్లకి సంబంధమేంటని, వైసీపీ కార్యక్రమాలు ఎలా చేయాలో మేం చెబుతున్నామా? అని మండిపడ్డారు పవన్. జనవాణి అంటే జనం గొంతు అని, అలాంటి కార్యక్రమం చేపడితే జనం గొంతు నొక్కేస్తామంటే ఎలా? వైకాపాకు 30 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతసేపూ బూతు పురాణం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకొస్తారని. ఆయన ప్రశ్నించారు. భూ నిర్వాసితులు, పింఛన్లు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇలా 3వేలకు పైగా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆయన అన్నారు.
పోలీసు శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని పవన్ అన్నారు. శనివారం మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలు చూశారని, తమపై పోలీసులు జులుం చూపుతూ వైకాపా ప్రభుత్వానికి అడ్డగోలుగా కొమ్ముకాశారుని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు ఎందుకు పరిష్కరించలేకపోయారని పవన్ ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కింద ఈ పోలీసులు పనిచేస్తున్నారని, మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంఅని, నేను బస చేసిన హోటల్ వద్ద వేకువజామున 3-4 గంటల వరకు పోలీసు అధికారులు తిరిగారు, గంజాయి దొంగలను వదిలేయండి, దోపిడీదారులు, నేరస్థులకు కొమ్ముకాయండి, సామాన్యుల గొంతు వినిపించే జనసేనను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టండని పవన్ అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమపై మీకు అంత ప్రేముందా? అని పవన్ ప్రశ్నించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, 2014లోనే కర్నూలునో, విశాఖనో నిర్ణయించి ఉంటే అదే ఉండేదని, రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని, సీఎం మారితే రాజధాని మారిపోవాలా అని పవన్ అన్నారు. నిజంగా మీకు ఉత్తరాంధ్ర, రాయలసీమపై అంత ప్రేముందా? రాయలసీమ నుంచి అంతమంది సీఎంలుగా వచ్చినా ఎందుకు ఆ ప్రాంతం వెనుకబడింది? అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టరెందుకు? ఉత్తరాంధ్ర నేతల్లో లేని వెనుకబాటుతనం ప్రజల్లోనే ఎందుకుందని పవన్ నిలదీశారు.అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలు, కార్యకర్తల్ని విడుదల చేసేవరకు జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్.