పవన్ కళ్యాణ్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాటకాలు - నాదెండ్ల మనోహర్
JanaSena Leaders Responds On The Vizag Airport Attack Issue
By - Nellutla Kavitha |
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు జనాల్ని సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగానీ, అది జనసేన వాళ్ళు చేసినట్లుగానీ పోలీస్ శాఖ నిర్ధారించలేదని, కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమేనని మనోహర్ అన్నారు.
దాడి సంస్కృతిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని, ఆ విద్యలో వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారని మనోహర్ అన్నారు. విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోడి కత్తి హడావిడి చేశారని, ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదని అన్న మనోహర్ అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంత్రుల మీదే దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని మనోహర్ ప్రశ్నించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ జన సందోహం వచ్చిందని, రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెర తీసిందని ఆయన అన్నారు.
విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసని, మంత్రుల కాకమ్మ కథలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తగినంత బందోబస్తు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశామని, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కు తమ పార్టీ నేతలు లేఖ ఇచ్చినా తగిన విధంగా స్పందించలేదని మనోహర్ అన్నారు. నామ మాత్రంగానే పోలీసు సిబ్బందిని కేటాయించడం వెనక అధికారులపై ఒత్తిడి ఉన్న విషయం అర్థమవుతోందని, పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా పవర్ కట్ చేశారని, అంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.