బీఆర్ఎస్ జెండా, ఎజెండా లేని పార్టీ - బండి సంజయ్
BRS Has No Agenda - Says Bandi Sanjay
By - Nellutla Kavitha | Published on 6 Oct 2022 1:58 PM GMTబీఆర్ఎస్ జెండా, ఎజెండా లేని పార్టీ అని సీయం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో పట్టిన కొత్త పార్టీ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పై గెలిచిన కేసీఆర్, సీఎంగా కొనసాగే అర్హతే కోల్పోయారని దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పై పోటీ చేయాలని అన్నారు బండి సంజయ్.
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? ఆయన ఎన్ని డ్రామాలేసినా, బీఆర్ఎస్సే కాదు, పీఆర్ఎస్ (ప్రపంచ రాజ్య సమితి) అని పేరు పెట్టుకున్నా ఆయన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లే'' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడితే, మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకే ఆ కొత్త పార్టీ సంగతి తెల్వట్లేదని, ఇయాళ ఒకాయనేమో బీఎస్పీ అంటున్నడని, ఇంకోకాయనేమో ఇంకో పేరు చెబుతున్నడని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ జెండా, ఎజెండా లేని పార్టీ, టీఆర్ఎస్ స్థాపించినప్పుడున్న వ్యవస్థాపకుల్లో ఇప్పుడెంత మంది ఉన్నరు? ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టిండో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమాల బండారం బయటపడుతుంటే చర్చను దారి మళ్లించేందుకు, కొడుకును సీఎంగా చేసేందుకు, బిడ్డకు కేంద్రంలో ఏదో ఒక పని కల్పించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పెట్టాడని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొత్త పార్టీ పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నడని, ఈ సంగతి తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామాలాడుతున్నడని అన్నారు సంజయ్.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మి ఓట్లేస్తే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని, తక్షణమే రాజీనామా చేసి బీఆర్ఎస్ పై పోటీ చేసి ప్రజాతీర్పుకు సిద్ధపడాలని, మునుగోడులో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు.