తెలంగాణాలో పీక్ స్టేజ్ లో పొలిటికల్ హీట్
Political Heat Reached To Peak Stage In Telangana
By - Nellutla Kavitha | Published on 1 July 2022 9:30 AM GMTమహారాష్ట్రలో మహా పొలిటికల్ డ్రామాకు చివరకు తెరపడింది. రాజకీయ సంక్షోభం తో పది రోజులుగా క్షణక్షణానికి మారిన పరిణామాలు ఉత్కంఠను రేపాయి. చివరికి బీజేపీ మార్క్ ట్విస్టుతో రాజకీయ కల్లోలం ఒక కొలిక్కి వచ్చింది. గత పది రోజులుగా దేశ ప్రజతో పాటుగా రాజకీయ విశ్లేషకులు చూపులన్నీ మహారాష్ట్ర వైపే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం దృష్టంతా సడన్ గా తెలంగాణ వైపు మళ్ళింది.
ఇక్కడ ప్రస్తుతం పొలిటికల్ హిట్ పీక్ స్టేజ్ లో కనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్ మరోవైపు మోది, పోటాపోటీ ర్యాలీలు, సభలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, సమావేశాలు. హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారబోతోంది. తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రం - ఇది బిజెపి లక్ష్యం. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి - ఇది కేసీఆర్ టార్గెట్. సాలు దొరా సెలవు దొర - ఇది బిజెపి నినాదం. సాలు మోదీ సంపకు మోదీ - ఇది టిఆర్ఎస్ క్యాంపెయిన్. ఇందుకోసం టిఆర్ఎస్॥ బిజెపి హైదరాబాద్ ను వేదికగా ఎంచుకున్నాయి. ఇటు కేసిఆర్, అటు మోదీ శనివారం జాతీయ రాజకీయాల కోసం పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రోజు హైదరాబాద్ కు వస్తున్నారు. సరిగ్గా అదే రోజున రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు ఆహ్వానించారు. ఇటు బిజెపి మోదీకి, అటు టిఆర్ఎస్ సిన్హా కు భారీ స్వాగతంతో పాటుగా ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సమయంలోనే జలవిహార్ లో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కెసిఆర్, యశ్వంత్ సిన్హా కు మద్దతుగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిజెపిని లక్ష్యంగా చేసుకొని తన పావులు కదపాలి అని చూస్తున్న కేసీఆర్ తన ప్రత్యక్ష కార్యాచరణను ఈ కార్యక్రమంలో ప్రారంభిస్తారని చెబుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు అప్పగించింది గులాబీ పార్టీ. ఇక తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహం గురించి జాతీయ కార్యవర్గ సమావేశంతో పాటుగా, మరుసటి రోజు పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒకరోజు ముందే బీజేపీ కార్పొరేటర్ లను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం, సమావేశాల పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న అక్రమ వసూళ్ళ గురించి కూడా మాట్లాడతాము అంటూ టిఆర్ఎస్ నేతలు సమావేశాలు మొదలు పెట్టారు. ఇక బీజేపీ మాత్రం తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్, కష్టపడండి మనదే అధికారం అంటూ జాతీయ స్థాయి నేతలను జిల్లాల్లో నియోజకవర్గాల్లో మోహరిస్తోంది. టిఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ బిజెపి రావాల్సిన ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేస్తున్నారు కమలం నేతలు.
ఇక ఫ్లెక్సీలు కటౌట్లుల వార్ మరోరకంగా ఉంది పోటాపోటీ ప్రకటనలు, భారీ స్థాయి హోర్డింగ్లు నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. స్వాగత తోరణాలు, ద్వారాలు, ఆంక్షలు, నియంత్రణలు సరేసరి. ముందస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ, ఇంత ముందుగా ఎన్నికల వాతావరణం వస్తుందని ఎవరూ అంచనా వేయ లేదంటున్నారు. మొత్తానికి మండే ఎండల నుంచి కాస్త విముక్తి లభించినా, పొలిటికల్ హీట్ మాత్రం పీక్ స్టేజ్ లోకి చేరుకుంది. మరి రెండు రోజుల సమావేశాలు, సభల తర్వాత ఏ రేంజ్ లోకి వెళుతుంది? మాటలు, వాటి రియాక్షన్ ఎలా ఉండబోతున్నాయి? టిఆర్ఎస్, బిజెపి తరవాత కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి ఎన్నికలను మించిన రాజకీయ వాతావరణం తెలంగాణలో రాబోయే రోజుల్లో కనిపించబోతోంది.