జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో కీలక పరిణామాలు

JubileeHills Minor GangRape Case - Victim Identified All Six Accused

By -  Nellutla Kavitha |  Published on  27 Jun 2022 9:42 PM IST
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో కీలక పరిణామాలు

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టు అనుమతితో నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పోలీసులు ఈరోజు పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్యే అత్యాచార నిందితులను పోలీసులు ఉంచి, బాధితురాలిని అత్యాచారం చేసిన వారిని గుర్తించిమని అడిగారు పోలీసులు. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.

ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసారు. వీరిలో మేజ‌ర్ అయిన ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా, మిగిలిన ఐదుగురు మైన‌ర్లు సైదాబాద్ లోని జువెనైల్ హోమ్ లో ఉన్నారు. నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌లో భాగంగా, చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. ఇందులో భాగంగా న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకుని కోర్టుకు అంద‌జేయ‌నున్నారు.

ఈ కేసుకే సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు నిందితుల డీఎన్ఏ సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టు ను ఆశ్రయించారు. ఐదుగురు మైనర్లతో పాటు ఏ1 సాదుద్దీన్ మాలిక్ డీఎన్ఏ సేకరణకు జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. ఒకటి రెండు రోజుల్లో నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇన్నోవాలో సేకరించిన ఆధారాలు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. ఈ కేసులో మరిన్ని బలమైన ఆధారాల కోసం చూస్తున్న పోలీసులు డీఎన్ఏ టెస్టులు చేసి, వాటిని కూడా చార్జ్ షీటులో పొందుపరిచేందుకు చూస్తున్నారు.

Next Story