సినీ కార్మికుల సమ్మె - తక్షణం పరిష్కరించండి : మంత్రి తలసాని
Telugu Cine Workers Strike
By - Nellutla Kavitha | Published on 22 Jun 2022 2:07 PM GMTసినీ కార్మికుల వేతనాలను 45 శాతం పెంచడంతోపాటు, విధి విధానాల్లో మార్పులు కోరుతూ సినీ కార్మికులు సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులు ఈరోజు నుంచి బందుకు పిలుపునిచ్చారు. 45 శాతం వేతనాలు పెంచే నిర్మాతల షూటింగులకు మాత్రమే కార్మికులు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.
వేతనాల పెంపుదలకు సంబంధించి నిర్మాతల దగ్గర నుంచి రాతపూర్వక హామీ తీసుకున్న తర్వాత మాత్రమే షూటింగ్ లకు హాజరవ్వాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పాత వేతనాలతో షూటింగులకు వెళ్ళమని, కొత్త వేతనాలు ఇవ్వాలని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫిలిం ఫెడరేషన్ నేతలు. ఈ ఒక్కరోజే 25 సినిమాల చిత్రీకరణ ఆగిపోయిందని, దీంతో 5 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని కార్మికులను అణగదొక్కేలా నిర్మాతల మండలి వ్యవహరించవద్దని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టంచేసింది.
ఇక కార్మికుల సమ్మెపై నిర్మాతల మండలి సమావేశమైంది. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. రేపటి నుంచి కార్మికులు షూటింగులలో పాల్గొనాలని సూచించింది. వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఎవరికీ ఇబ్బందులు లేవని, అయితే నిర్మాతలకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని, అందరూ కలిసి కూర్చొని చర్చించుకుందాం, అయితే ఒక్కసారిగా అందరూ సమ్మెకు దిగడంతో షాక్ అయ్యాం అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. నిర్మాతలందరూ షూటింగ్స్ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని, రేపటి నుంచి సినీ కార్మికులందరూ షూటింగులకు హాజరవ్వాలని, విధివిధానాలపై ఎల్లుండి చర్చించి ఒక నిర్ణయం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
సినీ కార్మికుల ఆందోళనకి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమాల చిత్రీకరణ లేకపోవడం, కరోనా కారణంగా ఏర్పడ్డ ఆర్థిక కష్టాలతో, ఉపాధి దొరకక సినీ కార్మికులు ఇబ్బందులులో ఉన్నారని, తక్షణమే కార్మిక సంఘాలతో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా రెండు, మూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరించాలని తలసాని సూచించారు.