ఎస్ ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి - పీ ఎస్ లో ఫిర్యాదు
Complaint Filed On Congress Leader Renuka Chowdary
By - Nellutla Kavitha | Published on 16 Jun 2022 7:33 PM IST
మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడిలో భాగంగా జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అదుపుచేస్తున్న సమయంలో ఆమె ఎస్‌ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్నారు. దాంతో ఆమెపై ఎస్‌ఐ ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాజ్ భవన్ ముట్టడికోసం కార్యకర్తలు, నాయకులు చేరుకునే సరికి అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేణుక చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టారు. వాగ్వాదానికి దిగిన రేణుక పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొడతానని ఎస్.ఐకి వార్నింగ్ ఇచ్చింది. ఎస్.ఐ కాలర్ పట్టుకుని రేణుక ప్రశ్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు రేణుకా చౌదరిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కాలర్ పట్టుకోవడంపై రేణుకా చౌదరిపై కేసు ఫైల్ చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎస్‌ఐ ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.
ఛలో రాజ్‌భవన్ లో భాగంగా ఖైరతాబాద్ వద్దకు యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చౌరస్తాలో బైక్‌కు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సుల రాకపోకలను అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. అయితే పోలీస్ ను అవమానించడం తన ఉద్దేశం కాదని, తమ చుట్టూ మగ పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు రేణుక చౌదరి. వెనకాల నుంచి తనను తోసి వేస్తేనే, అదుపుతప్పి కిందపడిపోతూ ఎస్ ఐ ని పట్టుకున్నానని అన్నారామె.