మోదీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ - రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth Reddy Reacts On KCR
By - Nellutla Kavitha |
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నామని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవాలని, అక్కడి నుండి రాజ్ భవన్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీని అవమానించేలా మోడీ చర్యలున్నాయని, ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమని, వాటిని నిరసిస్తూ ఎల్లుండి జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసనలు చేయాలని ఏఐసిసి పిలుపునిచ్చిందని రేవంత్ అన్నారు.
గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమని, రాష్ట్రపతి, ప్రధాని పదవులను త్యాగం చేసిన కుటుంబం వారిదని రేవంత్ అన్నారు. మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మలా మారారని, మోడీ ఆడించినట్టు ఆడడం కేసీఆర్ విధిగా మారిందన్నారు రేవంత్.
రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అని, ఎన్నికలకు దూరంగా ఉండి, బీజేపీని గెలిలించడానికి కేసీఆర్ దగ్గర సుపారీ తీసుకున్నాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి.