రెంటికీ చెడుతున్న టాలీవుడ్ నిర్మాతలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2020 8:53 AM IST
రెంటికీ చెడుతున్న టాలీవుడ్ నిర్మాతలు

దేశవ్యాప్తంగా సినీ నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది. మూడు నెలలకు పైగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోతే పరిస్థితేంటో చెప్పేదేముంది? కనీసం సమీప భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పటికే విడుదలకు సిద్ధం చేసిన సినిమాలకు సంబంధించి నిర్మాతల కష్టం మామూలుగా లేదు. వాటికి బిజినెస్ చేసుకోలేక, ఎప్పుడు విడుదల చేయాలో తెలియక, ఫైనాన్షియర్లకు వడ్డీలు కడుతూ నిండా మునిగిపోతున్నారు. పేరున్న నిర్మాతలు కూడా ఈ భారాన్ని మోయలేకపోతున్నారు.

లాక్ డౌన్ వేళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా.. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఆన్‌లైన్లో విడుదల చేయడం అనే ఆలోచనే నచ్చక వెనక్కి తగ్గారు. తాజాగా అగ్ర నిర్మాత సురేష్ బాబు.. టాలీవుడ్ నిర్మాతల్ని భయపెట్టేలా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల థియేటర్లు పున:ప్రారంభం అయినా.. ఆక్యుపెన్సీ 2 శాతానికి అటు ఇటుగా ఉందని.. మన దగ్గర థియేటర్లు మళ్లీ మొదలుపెట్టినా ఇదే పరిస్థితి అని.. కాబట్టి ఏడాది చివరికి కూడా పరిస్థితులు సాధారణంగా మారతాయని ఆశలేదని ఆయన కచ్చితంగా చెప్పేశారు.

దీంతో ఈ ఏడాది చివరి క్వార్టర్లో అయినా సినిమాలు రిలీజ్ చేసుకుందామని ఆశించిన నిర్మాతలకు భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇంత కాలం ఆగి సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేసి ఆశించిన రెవెన్యూ రాకపోతే నష్టం దారుణంగా ఉంటుందని భయపడుతున్నారు. ఇక ఓటీటీల సంగతి చూస్తే ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్లను ఇప్పుడు ఇవ్వడం కష్టమే అంటున్నారు. ఇప్పటిదాకా ఓటీటీల్లో డైరెక్ట్‌గా రిలీజ్ చేసిన సినిమాల ద్వారా వాటికి సబ్‌స్క్రైబర్లు పెద్దగా పెరగకపోవడంతో అయిన కాడికి రేట్లు ఇచ్చి కొని పరిస్థితి ఉండదంటున్నారు.

ఇంతకుముందు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ వద్దే వద్దన్న నిర్మాతలు ఇప్పుడు యు టర్న్ తీసుకున్నా.. వారికి ముందు ఆఫర్లు చేసిన రేట్లయితే వచ్చే అవకాశం లేదంటున్నారు . వాళ్లు ఆలస్యం చేసేకొద్దీ రేటు తగ్గుతుందే తప్ప పెరగదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మాతలు రెంటికీ చెడి దారుణంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Next Story