బాల‌య్య‌పై అంద‌రిలో గ‌ట్టిగా కేక‌లేశార‌ట ఎన్టీఆర్‌‌.. అప్ప‌టినుండే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 6:25 AM GMT
బాల‌య్య‌పై అంద‌రిలో గ‌ట్టిగా కేక‌లేశార‌ట ఎన్టీఆర్‌‌.. అప్ప‌టినుండే..

బాలకృష్ణ.. 2020 జూన్ 10 న 60 వ పుట్టినరోజును జరుపుకుంటున్న నందమూరి నట వారసుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ముక్కు సూటి మనిషే. ఆయనకు మంచి చేసేది అదే.. చెడు చేసేది కూడా ఆ ముక్కుసూటి తనమే. నందమూరి తారక రామారావుకు ఐదుగురు కొడుకులున్నా.. ఆయన సినీ, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ పేరు నిలబెట్టింది మాత్రం బాలయ్యే. 1974లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన బాలయ్య.. తనలోని నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకులచే నటరత్న అనిపించుకున్నారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్ లోనే జరిగింది. కానీ.. ఇంటర్ పూర్తికాగానే సినిమాల్లోకి హీరోగా రావాలనుకున్నా.. డిగ్రీ పూర్తి చేయాలన్న తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

B1

బాలకృష్ణకు తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంత గౌరవమో అంతే భయమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీర బ్రహ్మేంద్రస్వామి సినిమా షూటింగ్ లో బాలకృష్ణ ఎక్కువ టేక్ లు తీసుకుండటంతో.. తండ్రి అందర్లోనే గట్టిగా కేకలేశారట. అప్పటి నుంచి సినిమా అయినా, రాజకీయమైనా చాలా ఇన్ వాల్వ్ అవ్వడం అలవాటు చేసుకున్నారట బాలయ్య. తండ్రి తర్వాత తాను ఎక్కువ భయపడేది కూతురు బ్రహ్మణికేనని చెప్పారు బాలయ్య. నిజానికి తన కూతురి వల్లే తనకు సహనం అలవడిందన్నారు.

14 ఏళ్ల ప్రాయంలోనే సినీ జీవితంలోకి అడుగు పెట్టిన బాలయ్య.. దాసరి నారాయణ దర్శకత్వం వహించిన తాతమ్మ కల సినిమాలో ఎన్టీఆర్ - భానుమతిల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాల్లో బాలకృష్ణ నటించారు. 1984 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన రీమేక్ మంగమ్మ గారి మనువడు సినిమా బాలయ్యకు మంచి హిట్ ఇచ్చింది.

అప్పటి నటీమణులైన రోజా, రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, విజయశాంతి, రవీనా టండన్, ఆమని, ఇంద్రజ, కాంచన, లైలా, అంజలా జవేరి, సిమ్రాన్, సంఘవి, రాశి, ప్రీతి జింఘానియా, శిల్పాశెట్టి, టబు, శ్రియా, రీమాసేన్, ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, లయ తదితరులందరితో నటించిన సినిమాలు మంచి హిట్లందుకున్నాయి.

కేసీఆర్ అంటే అమితమైన గౌరవం..

ఇటీవల తెలంగాణలో సినిమా షూటింగులకు పర్మిషన్ కోసం ఫిలిం ఛాంబర్ సభ్యులు, చిరంజీవి, నాగార్జున తదితరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశానికి బాలకృష్ణకు పిలవకపోవడంతో ఆయన చాలా ఫీల్ అయ్యారన్న సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ లో కంటికి కనిపించని పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. ట్విట్టర్ లో పరస్పర ఆరోపణలు తర్వాత ఎవరికి వారు రియలైజ్ అయి సైలెంట్ అయ్యారు. కానీ ఏపీలో షూటింగుల కోసం జగన్ తో సమావేశమైనపుడు కూడా బాలయ్యను ఎవరూ పిలవలేదు.

B2

దీనిపై బాలయ్య స్పందిస్తూ.. బహుశా నేను అప్పుడు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని రియలైజ్ అయ్యారు. అప్పుడు అన్న మాటలకు భయపడే ఇప్పుడు పిలవలేదని భావిస్తున్నానన్నారు. తనకు ప్రభుత్వాలపై ఎలాంటి కోపం లేదని, తనను పిలవాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్ పై ఉంటుందన్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించి ఓ ముఖ్యమైన పనిని సీఎం కేసీఆర్ చాలా త్వరగా పూర్తి చేయించారని, అందుకే కేసీఆర్ అంటే తనకు చాలా గౌరవమన్నారు.

అవార్డులు.. పురస్కారాలు..

1994లో విడుదలైన భైరవద్వీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా బాలయ్య ఫిలింఫేర్ అవార్డునందుకున్నారు. 2001లో నరసింహనాయుడు, 2010లో సింహా చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులివ్వగా, నరసింహనాయుడు సినిమాకే సినీ గోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డునిచ్చింది. 2007లో అక్కినేని అభనయ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే..పాండురంగడు, సింహా, శ్రీరామ రాజ్యం సినిమాల్లో బాలయ్య నటనకు భరతముని అవార్డు దక్కింది. 2014లో లెజెండ్ చిత్రంలో నటించిన బాలకృష్ణకు SICA ఉత్తమ కథానాయకుడిగా అవార్డిచ్చింది.

B3

ఇప్పటి వరకూ 105 సినిమాల్లో నటించిన బాలకృష్ణకు లెజెండ్ తర్వాత మళ్లీ పెద్ద హిట్ రాలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పెద్ద హిట్ వస్తుందనుకున్నారు గానీ.. ఎవరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం హిట్ కాంబినేషన్..బోయపాటి శ్రీను - బాలయ్య సినిమా సెట్స్ మీదకెళ్లింది. లాక్ డౌన్ తో చిత్రం షూటింగ్ నిలిచిపోగా.. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఓ పంచ్ డైలాగ్ తో వదిలిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా హిట్ వస్తుందని అభిమానుల అంచనా. మరి ఈ సినిమా ద్వారానైనా బాలయ్యకు హిట్ వస్తుందో లేదో ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. విష్ యూ హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ.

Next Story