టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 9:20 AM GMTవెండి తెర, బుల్లితెర నటులు, నిర్మాతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవలే నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కు కరోనా వైరస్ సోకగా..ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా బుల్లితెర హీరో రవికృష్ణ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. స్టార్ మా లో ప్రసారమయ్యే ఆమెకథ సీరియల్ లో రవికృష్ణ సరసన నటిస్తోన్న నవ్యస్వామి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో కరోనా సోకిన ఓ నిర్మాత కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిర్మాత పోకూరి రామారావుకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతూ శ్వాసపరమైన ఇబ్బందులు రావడంతో శుక్రవారం రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టాలీవుడ్ ప్రముఖులు రామారావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
సోదరుడి ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగు..
పోకూరి రామారావు సోదరుడు పోకూరి బాబురావు ఈతరం ఫిలింస్ అధినేత. అలా సోదరుడి సహాయంతో ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ పై తీసిన చాలా చిత్రాలకు పోకూరి రామారావు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు. తొలుత బాబురావు తీసిన నేటిభారతం చిత్రానికి రామారావు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రణం, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, యజ్ఞం, అమ్మాయి కోసం, భారతనారి, ఎర్ర మందారం, మా ఆయన బంగారం, ప్రజాస్వామ్యం, అన్న, ఏం పిల్లో ఏం పిల్లడో వంటి చిత్రాలకు రామారావు సేవలందించారు.