కీరవాణి..నిజమైన మరకతమణి

By సుభాష్  Published on  4 July 2020 9:05 AM GMT
కీరవాణి..నిజమైన మరకతమణి

తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు విన్నవారెవరైనా సరే ఆ సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. కీరవాణి ఎక్కువగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరవాణికి చిన్నాన్న అవుతారు. రాజమౌళి - కీరవాణి వరుసకు అన్నదమ్ములవుతారు. అలాగే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీసిన సినిమాల్లో 25 చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చి మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు.

కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. మరకరతమణి కీరవాణి అని పిలవడం కష్టమైన కొందరు ఆయనను ఎంఎం కీరవాణి అని పిలవడంతో ఆ పేరే బాగా కీర్తిని తెచ్చిపెట్టింది. అలా తెలుగు ఎం.ఎం.కీరవాణిగా, తమిళ ఇండస్ట్రీలో మరకతమణిగా, బాలీవుడ్ లో ఎం.ఎం.క్రీమ్ గా కీరవాణి ప్రసిద్ధి గాంచారు. ఇంతకూ మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామో చెప్పలేదు కదూ..ఈరోజు అనగా జులై 4వ తేదీన మన కీరవాణి పుట్టినరోజు.

1961 జులై నాల్గవ తేదీన పుట్టిన కీరవాణి 1989లో వెండితెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతకుముందు రాజమణి, చక్రవర్తి వంటి వారి వద్ద కీరవాణి సహాయకుడిగా ఉన్నారు. మనసు - మమత సినిమాతో వెండితెరకు పరిచయమైన కీరవాణి 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్నందుకున్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ కీరవాణి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 100 చిత్రాలకు పైగా సంగీతాన్నందించారు. తెలుగులో కీరవాణి సంగీత దర్శకుడిగా పనిచేసిన సినిమాల్లోని కొన్ని పాటలు ఆల్ టైం సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్ళి సందడి, సుందరకాండ, యమదొంగ, మర్యాదరామన్న, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ఇంట్రో బ్యాక్ గ్రౌండ్ అదుర్స్ అంటూ నెటిజన్లు కీరవాణిని ఆకాశానికెత్తేశారు.

అవార్డులందుకున్న చిత్రాలు

కీరవాణి సంగీత దర్శకుడిగా 8 నంది అవార్డులందుకున్నారు. రాజేశ్వరి కల్యాణం (1992), అల్లరిప్రియుడు(1993), పెళ్లిసందడి (1995), స్టూడెంట్ నెంబర్ 1 (2001), ఒకటో నెంబర్ కుర్రాడు (2002), ఛత్రపతి (2005), వెంగమాంబ (2009), మర్యాద రామన్న (2010), ఈగ (2012) చిత్రాలకు సంగీతాన్నందించగా నంది అవార్డులు అందుకున్నారు. అల్లరి ప్రియుడు, శుభసంకల్పం, పెళ్లిసందడి, మగధీర చిత్రాలకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులందుకున్నారు. అలాగే 2017లో వచ్చిన బాహుబలి చిత్రానికి ఉత్తమ గేయ రచయితగా ఫిలింఫేర్ అందుకున్నారు కీరవాణి.

Next Story