చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? : వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరకం పదార్థాలతో లడ్డూ తయారు చేసేవారని బుధవారం జరిగిన టీడీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు
By Medi Samrat Published on 19 Sep 2024 12:00 PM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరకం పదార్థాలతో లడ్డూ తయారు చేసేవారని బుధవారం జరిగిన టీడీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల కొండ పవిత్రతను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దెబ్బతీశారని ఆరోపించారు. తిరుమల లడ్డూకు సంబంధించి నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించి కలుషితం చేశారని, ప్రభుత్వం మారిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూను తయారు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ అయింది. టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీశారన్నారు. తిరుమలలో నెయ్యి నాణ్యతను పరిశీలించటానికి ల్యాబ్ ఉందని, ఆ ల్యాబ్‌లో పరిశీలన అయ్యాకే దిగుమతి చేసుకుంటామన్నారు సుబ్బా రెడ్డి. తిరుమల ప్రసాదం విషయంలో భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతటి నీచాకైనా వెనుకాడడని విమర్శించారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడాం. స్వామివారి నైవేద్యంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చంద్రబాబు ఆరోపణల్లో నిజముంటే ఆధారాలు బయట పెట్టాలి. ఆ ఆరోపణలకు కట్టుబడి ఉంటే వెంటనే ప్రమాణానికి రావాలని అన్నారు సుబ్బా రెడ్డి. 2014-19 మధ్య ఏ విధానం అమల్లో ఉందో దాన్నే 2019-24 మధ్య అమలు చేశామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కొనే వస్తువుల్లో రసాయనిక పదార్థాలు ఉంటాయని కొనలేదని, రాజస్థాన్ లోని ఒక ఫార్మ్ నుండి తెప్పిస్తామన్నారు. ఇందుకోసం రోజుకు అయ్యే లక్ష రూపాయల ఖర్చును ఒక దాత భరిస్తున్నారని వివరించారు సుబ్బా రెడ్డి.