యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు : వైవీ సుబ్బారెడ్డి
YV Subbareddy About Tirumala Ghat Road Damage. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి
By Medi Samrat Published on 1 Dec 2021 4:11 PM ISTతిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5 - 40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని.. వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 - 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు.
ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.
ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.