టీటీడీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy Takes Oath AS TTD Chairman. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి

By Medi Samrat  Published on  11 Aug 2021 2:29 PM IST
టీటీడీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి.. సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


గత పాలక మండలి అనేక బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపినా కోవిడ్ వల్ల అవి ఆగిపోయాయన్నారు. రాబోయే రోజుల్లో వీటన్నిటినీ కొనసాగిస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాలు కొనసాగించడం కోసమే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మరోసారి తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ఈ భాగ్యం కల్పించిన స్వామివారి తో పాటు ముఖ్యమంత్రి జగన్ కు రుణపడి ఉంటానన్నారు.

దేశవ్యాప్తంగా సుమారు వంద ఆలయాల్లో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం కొనసాగిస్తూ.. దేశంలోని ముఖ్య ఆలయాలన్నింటిలో భక్తులు పూజ చేసుకునే ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని.. కోవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కొవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని చెప్పారు. గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకు పైగా కొనసాగుతోందన్నారు. శాశ్వతంగా ఈ కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు.

దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కోవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపి వేసిన సర్వ దర్శనం 15 రోజుల్లోపు కొంత సంఖ్యలో నైనా పునరుద్దరించేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని సుబ్బారెడ్డి తెలిపారు.


Next Story