తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికార కూటమి ప్రభుత్వానికి గట్టి రిప్లై ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు.
'తిరుమల పవిత్రత.. స్వామివారి ప్రసాదం విశిష్టత.. వెంకటేశ్వరస్వామి వైభవాన్ని.. టీటీడీ పేరు ప్రఖ్యాతులను.. వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రత.. రాజకీయ దుర్బుద్ధితో.. కావాలని అబద్ధాలాడారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా.. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది' అని జగన్ ట్వీట్ చేశారు. అదే రోజున జగన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని.. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారని తెలుస్తుంది.