Tirumala : వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కీలక సమాచారం..!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By - Medi Samrat |
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు తమ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.