మార్చి 20న ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Ttd To Release Tirumala Venkateswara Swamy Arjitha Seva Tickets In March 20th. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను
By Medi Samrat
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతిస్తారు.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు.
పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా, శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి.
నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసులు పూర్తైన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరింది.