తిరుమలకు వెళుతున్నారా.. ఈ లేఖలతో దర్శనం చేసుకోవచ్చు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సోమవారం నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది.
By Medi Samrat Published on 21 May 2024 5:30 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సోమవారం నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శనాలు మళ్లీ మొదలయ్యాయని.. సోమవారం నుంచి ఈ లేఖల్ని అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల ఆలయ ఈవో ఈసీకి మే 15వ తేదీన లేఖ రాశారు. తిరిగి తిరుమలలో వీఐపీల సిఫార్సు బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడి విజ్ఞప్తి చేసింది. టీటీడీ అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించడంతో సోమవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేయనున్నారు. ఎంపీలకు 12 వీఐపీ బ్రేక్ టిక్కెట్లు, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తోన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలను మే 21, 22వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు. మే 21, 22వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. మే 22వ తేది ఉదయం 8 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. మే 22వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.