ఆంధ్రప్రదేశ్‌లోని అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. ఇక నుండి తిరుమల వెంకన్న స్వామి అభిషేకించేందుకు గిరిజన తేను ఉపయోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ప్రతిపాదనకు టీడీపీ ఆమోదం తెలిపింది. గిరిజన తేనెను ల్యాబ్‌లలో నాణ్యత పరీక్షలు చేయించింది టీటీడీ. పరీక్షల్లో గిరిజన తేనెలో స్వచ్ఛత బాగుందని తెలిసింది. దీంతో వెంకటేశ్వరస్వామి అభిషేకానికి గిరిజన తేనె వాడాలని టీటీడీ నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను ఏపీ గిరిజన సహకార సంస్థ శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత కిలో రూ.298.77 చొప్పున తేనెను విక్రయిస్తోంది.
ఇక తిరుమల వెంకన్న అభిషేకానికి అవసరమయ్యే తేనెను తిరుపతి, రాజమండ్రి కేంద్రాల్లో శుద్ధి చేయనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఒక రోజుకు 2,500 నుంచి 3 వేల కిలోల తేనెను శుద్ధి చేసే సామర్థ్యం ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది. తేనెతో పాటు పసుపు, జీడిపప్పును తమ నుంచే కొనుగోలు చేయాలని టీటీడీకి ప్రతిపాదన చేశామని గిరిజన సహకార సంస్థ మేనేజర్ చినబాబు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో పాడేరులో గిరిజనుల నుంచి సేకరించే పసుపు నాణ్యతలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే పసుపు, జీడిపప్పు శాంపిళ్లను గిరిజన సహకార సంస్థ టీటీడీకి అందించింది. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. రాష్ట్రంలోని పలు ఆలయాలు, టూరిస్ట్ ప్రాంతాల్లో గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటుకు గిరిజన సహకార సంస్థ చర్యలు చేపట్టింది. దీని వల్ల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్ పెరగనుంది. ఇది గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పనుంది.