ఆ వదంతులను అసలు నమ్మకండి.. అసలు నిజం ఇది: టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని వదంతులు వచ్చాయి.
By Medi Samrat Published on 4 Oct 2024 11:44 AM GMTతిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని వదంతులు వచ్చాయి. అయితే శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ కోరింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు ముందే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ అని, ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని టీటీడీ వివరణ ఇచ్చింది. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరమని టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ తెలిపింది.
బ్రహ్మోత్సవ వాహనసేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.