టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల విగ్రహాలతో పాటు, సాంప్రదాయ, కలంకారి చిత్రాలను విక్రయించడం కోసం కళాశాల ఆవరణంలో కౌంటర్ ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కళాశాల ఆవరణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిల్పకళా ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కళాశాల విద్యార్థులు తయారుచేసిన శిల్పాలను చూసి వారి నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం కళాశాలలోని వివిధ శిల్పాలను, కలంకారి చిత్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిల్పకళ ను ప్రోత్సహించడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ సమయంలో వారి పేరుతో లక్ష రూపాయలు డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా అందిస్తున్నామని తెలిపారు. ఈ మొత్తం వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కళాశాలలో రెండేళ్ల కలంకారీ కోర్సులో చేరే విద్యార్థులకు కూడా లక్ష రూపాయలు డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నజేఈవో సదా భార్గవిని చైర్మన్ అభినందించారు.