శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రాబోవు రెండు, మూడు రోజులలోపు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం బయట టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయం పైన ఎలాంటి విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అవకాశం లేదని, ఆగమ శాస్త్రాల ప్రకారం నిషేధించబడిందని తెలిపారు. ఇంతకుముందు కానీ, ఇటీవల కాలంలో కానీ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు.
తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వున్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేస్తోందని టీటీడీ విజిలెన్స్, భద్రతాధికారులు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన వ్యక్తులను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో డ్రోన్ ద్వారా చిత్రించారా లేక పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి 3డి విధానంలోకి మార్చారా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు.
సదరు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి, సమగ్ర విచారణ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ వీడియో పై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని చైర్మన్ వివరించారు.