అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో.. తిరుపతి ఘటనలో మృతిచెందిన వారికి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురి కుటుంబాలకు రూ 25 లక్షల పరిహారం అందజేయాలని పాలకమండలి తీర్మానించింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం.. స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం అందజేయాలని పాలకమండలి నిర్ణయించింది.
న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తప్పిదం జరిగింది వాస్తవం.. తప్పు చేసినవారిని ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన.. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన 7 రోజులకు సంబంధించి వైకుంఠద్వార దర్శనానికి ఏ రోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తామని తెలిపారు. వైకుంఠద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తామన్నారు. ఈ యేడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయని తెలిపారు. మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుందని తెలిపారు.