తిరుమలకు వెళ్తున్నారా.. మీకిదే అధికారుల సూచన
మిచౌంగ్ తుపాను ప్రభావం ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాల మీద పడింది.
By Medi Samrat Published on 4 Dec 2023 1:14 PM GMTమిచౌంగ్ తుపాను ప్రభావం ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాల మీద పడింది. తిరుమలలో వర్షం కురుస్తూ ఉండడంతో పలు పర్యాటక ప్రదేశాల సందర్శనను టీటీడీ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పాపవినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగ తదితర ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా మూసివేశారు.
తిరుమలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం ముంచెత్తనుంది. మిచౌంగ్ తుఫాన్ ఈ తుఫాన్ ప్రభావం నేడు, రేపు రాయలసీమలో జిల్లాలపై ఉండనుంది. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.