ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ

తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

By Medi Samrat  Published on  2 Feb 2025 6:15 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ

తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈనెల స్వల్ప మార్పులు చేశారు. మొదటి మంగళవారమైన ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ కోరింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రమైన రోజున, మలయప్ప స్వామి ఏడు వేర్వేరు వాహనాలపై దర్శనం ఇస్తారు.

•⁠ ⁠ఉ. 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం

•⁠ ⁠ఉ. 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం

•⁠ ⁠ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం

•⁠ ⁠మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం

•⁠ ⁠మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం

•⁠ ⁠సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం

•⁠ ⁠సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం

•⁠ ⁠రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు. తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని కోరింది టీటీడీ.

Next Story