తిరుమలలో గదులు దొరకని భక్తులకు తిరుపతిలో బస చేసే అవకాశం

Tirumala News Updates. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సెలవులు ముగింపు దశకు రావడంతో

By Medi Samrat  Published on  9 Oct 2022 2:45 PM GMT
తిరుమలలో గదులు దొరకని భక్తులకు తిరుపతిలో బస చేసే అవకాశం

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సెలవులు ముగింపు దశకు రావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఈ పరిస్థితులపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని ఈవో నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలో బస చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ నుంచి వేచి ఉండే సామాన్యులకు ఉదయం త్వరగా దర్శనం అయ్యేలా వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భోజనం, మంచినీరు అందించేందుకు టీటీడీ యాజమాన్యం విస్త్రృతంగా ఏర్పాట్లు చేసింది.

అక్టోబరు 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయి. డిసెంబరులో ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని.. ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో అక్టోబర్ లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.


Next Story