తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ఆలోచన మంచిదే.. తిరుమలకు లింకు రోడ్డు ద్వారా అనుమతి

Tirumala Ghat Road. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి . ఈ భారీ వర్షాలకు శేషాచలం

By Medi Samrat  Published on  3 Dec 2021 1:50 PM GMT
తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ఆలోచన మంచిదే.. తిరుమలకు లింకు రోడ్డు ద్వారా అనుమతి

గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి . ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పోయాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల లో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని టీటీడీ అధికారులు తెలిపారు.తిరుమలలో ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు 4,5 కిలోమీటర్ల మధ్య కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు దగ్గర భారీగా చీలికలు ఏర్పడ్డాయి. ఘాట్ రోడ్డుపై మొత్తం రాళ్లు ఉండడం.. కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. జరిగిన ఘటన తెలిసిన వెంటనే టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే అధికారులను అప్రమత్తం చేసి.. అటువైపు వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

ఇప్పటికిప్పుడు కొండచరియలు విరిగి పడే ప్రమాదం లేదని నిపుణులు తేల్చారని ఆయన అన్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న కొండ చరియల తొలగింపు కార్యక్రమాన్ని మూడు.. నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కొండ చరియలు తొలగించే సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా కెమికల్స్ ద్వారా వాటిని పగులగొట్టే అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామని పేర్కొన్నారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులను మొదలు పెట్టి.. వీలైనంత త్వరగా నెల లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ఆలోచన మంచిదేనని చెప్పారు. మూడవ ఘాట్ రోడ్డు ఏర్పాటుపై కూడా ఆలోచన చేస్తామని తెలిపారు. అన్నమయ్య మార్గం అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందని తెలిపారు.


Next Story