తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రామ నామ స్మరణతో ఆలయం మార్మోగింది.
కంకణబట్టార్ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.
అంతకుముందు ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.
అనంతరం ఉదయం 11 నుండి 12.45 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
కాగా, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుంది.