రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
Srivari Hundi Revenue in the month of August is record. తిరుమల వేంకటేశ్వరుడి హుండీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది.
By Medi Samrat Published on 10 Sept 2022 4:14 PM IST
తిరుమల వేంకటేశ్వరుడి హుండీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టాక భక్తుల రద్దీ బాగా పెరిగింది. గత ఆగస్టు మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ద్వారా రూ.140.34 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారి ఆలయ చరిత్రలో ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం. ఆగస్టులో తిరుమల వెంకన్నను 22.22 లక్షల మంది దర్శించుకోగా, 1.05 కోట్ల లడ్డూలు విక్రయించారు. స్వామివారికి ఈ ఏడాది జులై మాసంలో హుండీ ద్వారా రూ.139.45 కోట్ల ఆదాయం రాగా.. మే నెలలో రూ.130.50 కోట్ల ఆదాయం లభించింది.
టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించనున్నామని ఈవో ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు . నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే బస చేయాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని అన్నారు.