తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే?
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 31 Aug 2023 2:32 PM GMTశ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. సెప్టెంబర్ 18న స్వామి వారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పిస్తారని తెలిపారు. గరుడ సేవ రోజున రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆసుపత్రి నుంచి సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు. ఘాట్ రోడ్డులో 24 గంటలపాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలిపారు.
ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, సెప్టెంబరు 22న గరుడ వాహనం, సెప్టెంబరు 23న స్వర్ణరథం, సెప్టెంబరు 25న రథోత్సవం(మహారథం), సెప్టెంబరు 26న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడవాహనం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం జరుగనున్నాయి.