ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం మండ‌లంలోని రాయ‌ల‌చెరువు నిండుకుండ‌ను త‌ల‌పిస్తోంది. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా చెరువు క‌ట్ట‌కు లీకేజీలు ఏర్ప‌డ్డాయి. ఏ క్ష‌ణం అయిన క‌ట్టతెగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రాయలచెరువు కింద ఉన్న గ్రామాలైన సంతబైలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరుతో పాటు గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు పల్లెలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మ‌రో వైపు చెరువు క‌ట్ట పటిష్ట‌తకు అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. తిరుపతి, చెన్నై ఐఐటీల సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్లు జానకీరామయ్య, రోషన్‌ శ్రీవాస్తవ, మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాస్, సోమశిల ప్రాజక్టు సీఈ హరినారాయణరెడ్డి, జలవనరుశాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి రాయ‌ల‌చెరువు క‌ట్ట‌ను పరిశీలించారు. లీకేజీని అడ్డుకునేందుకు కనీసం 35వేల ఇసుక మూటలు అవసరమవుతాయన్నారు. అధికారులు దాదాపు 50వేల సంచుల్లో ఇసుక‌, కంక‌ర నింపి చెరువు క‌ట్ట ప‌టిష్ట ప‌నుల‌ను వేగవంతం చేశారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story