మెట్ల మార్గంలో చిరుత సంచారంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు

అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించిందంటూ మరోసారి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  30 Dec 2023 7:48 AM GMT
మెట్ల మార్గంలో చిరుత సంచారంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు

అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించిందంటూ మరోసారి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే!! ట్రాప్ కెమెరాలకు చిరుత, ఎలుగుబంటి కదలికలు చిక్కాయని.. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో వీటి కదలికలు రికార్డయ్యాయని కథనాలు వచ్చాయి. శ్రీ నరసింహ స్వామి ఆలయంకు సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుకబంటి కదలికలు దొరికాయని.. డిసెంబరు 13, 29 ట్రాప్ కెమెరాకు చిరుత, ఎలుగుబంటి కదలికల్ని గమనించారని తెలిపారు.

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని, భక్తులు నిర్భయంగా తిరుమల రావొచ్చని టీటీడీ డీఎఫ్ వో శ్రీనివాసులు తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో చిరుత కదలికలు రికార్డయ్యాయని, గడిచిన 29 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచరించిందని వివరించారు. అదే ప్రాంతంలో ఒక ఏలుగుబంటి కూడా కనిపించిందని తెలిపారు. మెట్ల మార్గం చుట్టుపక్కల ఎలాంటి జంతు సంచారం లేదని తెలిపారు. భక్తుల భయాందోళనల నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామని, భక్తులు నిర్భయంగా కాలినడకన తిరుమలకు రావొచ్చని శ్రీనివాసులు వివరించారు. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలిపిరి నడకమార్గంలో రాత్రి 10 గంటల తర్వాత భక్తుల్ని అనుమతించడం లేదు. ఉదయం ఆరు గంటల తర్వాత మాత్రమే నడకదారిలో అనుమతిస్తారు. నడక మార్గంలో 12 ఏళ్లలోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించడం లేదు.

Next Story