మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోందని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. కాగా ఇవాళ తిరుమంజనం వైభవంగా నిర్వహించామని ఆయన తెలిపారు. తిరుమంజనం నిర్వహించే సమయంలో స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పారు.

ఆలయంలోని బంగారు వాకిలి మొదలుకొని ఆనంద నిలయం వరకు, ఆలయ ప్రాంగణం, ఉప ఆలయాలు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన పరిమళాన్ని శ్రీవారికి సమర్పించారు. ఆ తర్వాత ఆలయ గోడలపై ఆ పరిమళాన్ని పూతగా పూయడం జరిగిందని అదనపు ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. ఇక వైకుంట ఏకాదశి నాడు స్వామి దర్శనం పొందే భక్తులు రేపటిలోగా తిరుమల చేరుకోవాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు.. ఇవాళ్టి నుండి గదుల కేటాయింపును తిరుమలలో తాత్కాలికంగా నిలిపివేశారు. ఇవాళ స్వామి వారి దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story