రేపు శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది
By Medi Samrat
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
వరుస సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండాయని టీటీడీ తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,625 మంది స్వామిని దర్శించుకోగా.. 34,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.63 కోట్ల కానుకలను భక్తులు సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.