టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నిరసన
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నేతలు నిరసనకు దిగారు.
By Medi Samrat
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నేతలు నిరసనకు దిగారు. శ్రీవారి భక్తులపై టీటీడీ కఠిన ఆంక్షలు విధించిందంటూ ఆందోళన చేపట్టారు. నడకదారి భక్తులపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. టీటీడీ నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని.. టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. శ్రీవారి భక్తులకు ఊతకర్రలు పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మెన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.
ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్యమతస్ధులను తితిదే ఛైర్మన్ గా నియమించారని ఆరోపిస్తూ ఏపీ సాధుపరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద సేవ్ తిరుమల - సేవ్ టీటీడీ అంటూ ధర్నా నిర్వహించారు. భక్తితో, విశ్వాసంతో ఉన్న హిందువులను టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు. క్రిస్టియన్ అయిన వ్యక్తికి హందువుల పవిత్ర క్షేత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.? టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తన కూతురు పెళ్లి సైతం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని... అలాంటి వ్యక్తిని ఎలా ఛైర్మన్గా నియమిస్తారని శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు వేంకటేశ్వర స్వామి ఆదాయం మాత్రమే కావాలన్న ఆయన, భక్తులు పడే సమస్యలతో అవసరం లేదనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.