తిరుపతిలో ఐదుగురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని నెహ్రూనగర్‌లో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్స్‌కు వెళ్లి ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు సహా ఐదుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోయారు.చుట్టుపక్కల ప్రాంతాలు, స్టడీ అవర్స్ సెంటర్‌లో వెతికినా విద్యార్థులు కనిపించలేదు. విద్యార్థుల అదృశ్యంపై తల్లిదండ్రులు బుధవారం ఫిర్యాదు చేయడంతో అలజడి రేగింది. విద్యార్థుల ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. నెహ్రూనగర్‌లోని శ్రీ అన్నమయ్య పాఠశాలలో చదువుతున్న మెహత, గుణశ్రీ, మౌనశ్రీతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్టడీ అవర్స్ పేరుతో బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. అయితే వారి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారు స్కూల్‌కు వెళ్లలేదని తేలింది. ప్రస్తుతం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలను నియమించి వెతుకున్నామని పోలీసులు వెల్లడించారు.