సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల మూసివేత
Due to Partial Solar Eclipse many Temples in telugu states will close today.సూర్య గ్రహణం కారణంగా ఆలయాలను మూసివేత
By తోట వంశీ కుమార్ Published on 25 Oct 2022 8:59 AM ISTనేడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం ఉండనుంది. భారతదేశంతో పాటు ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కనిపించనుంది. సూర్య గ్రహణం కారణంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను అన్నింటిని మూసివేయనున్నారు.
- తిరుమల శ్రీవారి ఆలయాన్న ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు.
తెలంగాణలో..
-యాదాద్రి ఆలయాన్ని మంగళవారం ఉదయం 8:50 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు నిర్వహించాల్సిన శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. బుధవారం ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
- భద్రాద్రి రామాలయాన్ని ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు.
- చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 8.30 గంటల నుంచి మూసివేస్తారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇస్తారు.
-వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.
-జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని, అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
-వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
- తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
– విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు. రేపు ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
- సింహాద్రి అప్పన్న ఆలయాన్ని 9 గంటల నుంచి మూసివేయనున్నారు. అన్ని ఆర్థిజసేవలు రద్దు చేశారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం 6 గంటల నుంచి భక్తులకు అనుమతించనున్నారు.
- అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా స్వామి వారి దర్శనాలు, వ్రతాలు సేవలు ప్రారంభించనున్నారు.