తిరుప‌తి ఉప ఎన్నిక.. డీజీపీ ఏమ‌న్నారంటే..‌

DGP About Tirupati Bypoll. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది డి‌జి‌పి గౌత‌మ్ స‌వాంగ్

By Medi Samrat  Published on  17 April 2021 2:20 PM IST
తిరుప‌తి ఉప ఎన్నిక.. డీజీపీ ఏమ‌న్నారంటే..‌

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది డి‌జి‌పి గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని ఆయ‌న తెలిపారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు.. భారీగా 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో ఈ ఎన్నికల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామ‌ని అన్నారు.

ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని డి‌జి‌పి తెలిపారు. సరిహద్దులలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామ‌ని.. ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపామని అన్నారు. ఇప్పటి వరకు 33,966 మందిని బైండ్ ఓవర్ చేయగా..76,04,970 లక్షల రూపాయల నగదును.. 6884 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి.. 94 వాహనాలను జప్తు చేసామ‌ని వివ‌రాలు వెల్ల‌డించారు. ‌

ఉద్దేశ్యపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఏ సమస్య ఉత్పన్నమైన తక్షణమే డయల్ 100, 112 ద్వారా పోలీసుకు సమాచారం అందివ్వాలని ప్రజలను కోరామ‌న్నారు. ఇప్పటికే చాలామంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ప్రజాసామ్య పరిరక్షణలో తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే.. వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని.. ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నకిలీ ఓట్లపై ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో ఆయ‌న‌ మాట్లాడారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ అదేశించారు. తిరుపతి ఉపఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు.




Next Story