టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు గురించి తెలుసా?
ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి సమక్షంలో పాడాలని ఎంతో మందికి ఉంటుంది.
By Medi Samrat Published on 21 Oct 2023 8:58 AM GMTఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి సమక్షంలో పాడాలని ఎంతో మందికి ఉంటుంది. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఓ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీవారి సేవలో తరించాలనుకునే గాయకులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. దాస సాహిత్య ప్రాజెక్టు తరపున తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో నిర్వహించే ఊంజలసేవలో భక్తి గీతాలు ఆలపించడానికి ఔత్సాహిక గాయనీ, గాయకులకు అవకాశం ఇవ్వనున్నారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి ఉన్న గాయనీ, గాయకులు టీటీడీ అధికారిక వెబ్సైట్ htpp://apps.tirumala.org/dsp/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్, లేదా ఇతర మాధ్యమాల ద్వారా పంపే దరఖాస్తులు అంగీకరించరని టీటీడీ తెలిపింది. కళాకారులు అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న గాయనీ, గాయకులకు నవంబరు 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 9గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికలో పారదర్శకత పాటించడం కోసం ఎస్వీ బీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న గాయనీ గాయకులు వారికి కేటాయించిన సమయానికి హాజరు కావాలని కోరింది. ఈ ప్రక్రియకు సంబంధించి టీటీడీ ఎలాంటి ఏజెంట్లు, ప్రతినిధులను నియమించలేదనీ, మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది.