తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
By Medi Samrat
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవో జె.శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. .
* తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం.
* తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం.
* అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించేందుకు నిర్ణయం.
* తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం.
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
* శ్రీవారిసేవను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు ఆమోదం.
* శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం.
* తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.
* తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం.
* పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని నిర్ణయం.
* సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయం. ఒక్కొక్క మైక్ సెట్ ఖర్చు రూ.25 వేలు.
* వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం.
* రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు.
* ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం.